పంజాబ్‌లో బిజెపి దళిత కార్డు


సాగుచట్టాలతో ఆగ్రహంగా ఉన్నరైతులు

దళితుల ప్రసన్నం కోసం నేతల పాట్లు
ఛండీఘడ్‌,ఫిబ్రవరి8(జనం సాక్షి): పంజాబ్‌లో రాజకీయం మారుతోంది. తాజాగా డేరాబాబకు పెరోల్‌ లభించడం పైనా విమర్శలు వస్తున్నాయి. పంజాబ్‌ రాజకీయాల్లో జాట్‌ సిక్కులదే ఆధిపత్యమైనప్పటికీ... ప్రస్తుతం పరిస్థితి వేరుగా ఉంది. మూడు నూతన వ్యవసాయ సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ దీర్ఘకాలిక భాగస్వామి అయిన శిరోమణి అకాలీదళ్‌ ఎన్డీయేను వీడటంతోనే కమలదళం అప్రమత్తమైంది. ప్రధానంగా వ్యవసాయాధారిత రాష్ట్రమైన పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 20న జరగనున్నాయి, తాము గెలిస్తే
దళిత సామాజికవర్గానికి చెందిన వ్యక్తినే ముఖ్యమంత్రిని చేస్తామని గత ఏప్రిల్‌లోనే ప్రకటించడం ద్వారా బీజేపీ ఈ వర్గంలో కొత్త ఆశలు రేకెత్తించింది. పంజాబ్‌ జనాభాలో దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఏకంగా 32 శాతం మంది దళిత ఓటర్లు ఉన్నారు. మూడిరటి ఒకవంతున్న దళిత ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఇప్పుడు రాజకీయపక్షాలన్నీ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఇప్పుడు పంజాబ్‌ రాజకీయమంతా దళితుల చుట్టూనే తిరుగుతోంది. పంజాబ్‌లోని దళితుల్లో... హిందు దళితులు, సిక్కు దళితులుగా రెండు వర్గాలున్నాయి. హిందు దళితుల శాతం ఎప్పటికప్పుడు మారుతూ ఉండటానికి కారణం... వీరిలో చాలా మంది సిక్కు మతంలోకి మారిపోవడం, రవిదాసియా, ఆది ధర్మిలు మాత్రం తమను ప్రత్యేక మతంగా గుర్తించాలనే డిమాండ్లు వినిపిస్తున్నారు. 2018 సామాజిక సాధికార శాఖ గణాంకాల ప్రకారం పంజాబ్‌ దళితుల్లో మొత్తం 39 ఉపకులాలున్నాయి. వీటిలో ఐదు ప్రముఖమైనవి.
రాష్ట్ర జనాభాలోని 60 శాతం సిక్కుల్లో జాట్‌ల వాటా 21 శాతమే అయినప్పటికీ అదే ఆధిపత్య వర్గం. రాజకీయ నాయకత్వమంతా దశాబ్దాలుగా ఈ వర్గం చేతిలోనే కేంద్రీకృతమవుతోంది. ఆయా పార్టీల సంప్రదాయ ఓటు బ్యాంకుకు దళితుల ఓట్లు తోడైతేనే ఏ పార్టీ అయినా ప్రస్తుతం పంజాబ్‌ సీఎం పీఠాన్ని అందుకోగలుగుతుంది. కాంగ్రెస్‌కు మారుపేరుగా నిలిచిన కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ హస్తం పార్టీకి గుడ్‌బై కొట్టి... బీజేపీతో జట్టుకట్టడంతో ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. మరోవైపు రెండు దశాబ్దాలకు పైగా బీజేపీతో ఉన్న బంధాన్ని తెగదెంపులు చేసుకున్న శిరోమణి అకాలీదళ్‌ కొత్తగా మాయావతి పార్టీ బీఎస్పీతో పొత్తపెట్టుకోవడం, ఆమ్‌ ఆద్మీ పార్టీ... దళిత ఎమ్మెల్యే హర్బాల్‌ సింగ్‌ (దిర్బా నియోజకవర్గం)ను అసెంబీల్లో ఆప్‌ పక్ష నేతగా నియమించడం... ఆసక్తిగా మారాయి. అమరీందర్‌ సింగ్‌`సిద్ధూల మధ్య గొడవ తలకుమించిన భారం కావడంతో కాంగ్రెస్‌ గత ఏడాది సెప్టెంబరులో తెగించేసింది. జాట్‌ సిక్కు అయిన కెప్టెన్‌ అమరీందర్‌ స్థానంలో రవిదాసియా వర్గానికి చెందిన దళితుడైన చరణ్‌జిత్‌సింగ్‌ చన్నీని సీఎంగా నియమించి అందరికంటే ముందుగానే దళిత ఛాంపియన్‌ అనిపించుకునే ప్రయత్నం చేసింది. గురు రవిదాస్‌ జయంతిని పురస్కరించుకొని... ఎన్నికలను షెడ్యూల్‌ ప్రకారం ఫిబ్రవరి 14న కాకుండా మరో ఆరురోజులు ముందుకు జరిపి ఈ నెల 20 నిర్వహించాలని పంజాబ్‌ సీఎం చన్నీ ఎన్నికల సంఘాన్ని డిమాండ్‌ చేశారు. మిగతా రాజకీయపక్షాలన్నీ ఆయన డిమాండ్‌కే మద్దతు పలకడంతో ఈసీ పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలను ఈనెల 20కి వాయిదా వేసింది. ఈ చర్య దళితుల్లో చన్నీ గ్రాఫ్‌ను అమాంతంగా పెంచేసిందని రాజకీయ పండితులు విశ్లేషణ.