ఉక్రెయిన్‌ ఉక్కిరి బిక్కిరి


` మొదలైన భీకర యుద్ధం
` 70కిపైగా ఉక్రెయిన్‌ సైనిక స్థావరాల ధ్వంసంచేసిన రష్యా
` 68మందికి పైగా సైనికులు,పౌరులు మృతి
` ఎదురుదాడికి దిగిన ఉక్రెయిన్‌
` రష్యన్‌ ఫైటర్‌ జెట్లను కూల్చేసినట్లు ప్రకటన
` పోరాడే వారందరికి ఆయుధాలిస్తాం
` ప్రజలు కూడా యుద్ధరంగంలో దిగండి
` పిలుపునిచ్చిన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ
` తెల్లవారుజామునే బాంబర్లతో మొదలైన దాడి
` యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌లో మార్షల్‌లా విధింపు
` ప్రాణాలు కాపాడుకునేందుకు సురక్షిత ప్రాంతాలకు ప్రజలు
` నేడు మరోమారు భద్రతామండలి అత్యవసర భేటీ
` దాడిని సమర్థించుకున్న రష్యా
` ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులు
` రష్యా దాడిపై ప్రపంచ దేశాల ఆగ్రహం
` ఉక్రెయిన్‌కు అండగా నిలిచిన అమెరికా తదితర దేశాలు
` ఉద్రిక్త పరిస్థితులలో భారత్‌ సహాయం కోరిన ఉక్రెయిన్‌
ఉక్రెయిన్‌పై రష్యా యుద్దం
తెల్లవారుజామునే బాంబర్లతో మొదలైన దాడి
ఎదురుదాడికి దిగిన ఉక్రెయిన్‌
రష్యన్‌ ఫైటర్‌ జెట్లను కూల్చేసినట్లు ప్రకటన
యుద్దం నేపథ్యంలో ఉక్రెయిన్‌లో మార్షల్‌ లా విధింపు
ప్రాణాలు కాపాడుకునేందుకు సురక్షిత ప్రాంతాలకు ప్రజలు
నేడు మరోమారు భద్రతామండలి అత్యవసర భేటీ
కీవ్‌,ఫిబ్రవరి 24(జనంసాక్షి): ప్రపంచ దేశాలు భయపడినట్లుగగానే.. ఉక్రెయిన్‌పై రష్యా సమరభేరి మోగించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఉక్రెయిన్‌పై మిలటరీ ఆపరేషన్‌కు ఆదేశించారు. ఉక్రెయిన్‌ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యమని పుతిన్‌ ప్రకటించారు. ఆయన ప్రకటనతో రష్యా బలగాలు దూకుడు పెంచాయి. ఉక్రెయిన్‌పై దూసుకెళ్లేందుకు దాడులకు దిగాయి. గురువారం తెల్లవారుజాము నుంచే ఉక్రెయిన్‌పై దాడులు కొనసాగిస్తోంది. దీంతో ఆ దేశ సరిహద్దుల్లో బాంబుల మోత మోగుతోంది. ముందు నుంచి అలుముకున్న యుద్ధమేఘాలు అమల్లోకి వచ్చాయి. ముందు నుంచి దూకుడు ప్రదర్శించిన రష్యా.. ఉక్రెయిన్‌పై దాడికి దిగింది. రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌ కూడా ఎదురుదాడికి దిగింది. దీంతో ఇక ప్రత్యక్ష యుద్దం అనివార్యం అయ్యింది. ప్రపంచ దేశాలన్నీ ప్రతిఘటిస్తున్నా.. యుద్దానికి కాలుదువ్వింది. అమెరికా హెచ్చరికల నేపథ్యంలో ఒక కాలు వెనక్కి వేసినట్లు కనిపించినా..ఉక్రెయిన్‌ ఒక అడుగు ముందుకు వేయడంతో రష్యా రెండడుగులు ముందుకు వేసింది.అర్ధరాత్రి సమయంలో ఉన్నపళంగా దాడికి దిగిన రష్యా.. ఉక్రెయిన్‌ ఊపిరి పీల్చుకోకుండా ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది. ఎయిర్‌ బేస్‌లపై దాడి, ఎయిర్‌పోర్ట్‌ లపై అటాక్‌, విద్యుత్‌ వ్యవస్థపై దాడి.. ఇవన్నీ చూస్తుంటే.. పక్కా ప్రణాళికతో దాడికి దిగినట్లు అర్థం అవుతుంది. కీ జోన్స్‌పై దాడి చేసి.. ఎదురుదాడి చేయకుండా పక్కాగా ప్రణాళిక రచించినట్లు రష్యా తాజా దాడులు స్పష్టం చేస్తున్నాయి. డోన్‌బోస్‌ నుంచి ఉక్రెయిన్‌ బలగాలు వెనక్కి వెళ్లాలని పుతిన్‌ హెచ్చరించారు. ఎక్కడికక్కడ శిబిరాలు, ఆయుధాలను వదిలేసి వెళ్లిపోవాలని హెచ్చరిక చేశారు. మరోవైపు ఉక్రెయిన్‌ సయితం మరింత అప్రమత్తమైంది. రష్యా దూకుడుకు ధీటుగా వ్యవహరిస్తోంది. భారీగా రిజర్వు, అదనపు బలగాలను మోహరించింది. ఉక్రెయిన్‌లో నెలరోజుల పాటు ఎమర్జెన్సీ ప్రకటించింది. ముందు జాగ్రత్తగా ఎయిర్‌ స్పేస్‌ను కూడ మూసివేసింది. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్‌లో అత్యవసర పరిస్థితి కొనసాగుతోంది. అలాగే వైద్య శిబిరాలను సయితం ఏర్పాటు చేశారు. ఉన్నపళంగా దాడికి తెగబడ్డ రష్యా.. ఉక్రెయిన్‌ను చుట్టుముట్టింది. మూడు వైపుల నుంచి దాడి చేసి.. ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేసింది. ఏ వ్యవస్థ పనిచేయాలన్నా.. విద్యుత్‌ అంత్యంత ముఖ్యం. ఆ వ్యవస్థను దెబ్బతీసేలా రష్యా దాడులకు తెగపడిరది. ఆ తర్వాత దాడులపై ఎదురుదాడి చేయాలంటే ఎయిర్‌పోర్ట్‌లు, ఎయిర్‌బేస్‌లు చాలా కీలకం. ఏకంగా 11 నగరాల్లో.. ఆయా కేంద్రాలను సెర్చ్‌ చేసి అటాక్‌ చేసింది. అయితే రష్యా దాడులతో అప్రమత్తమైన ఉక్రెయిన్‌ ఎదురుదాడి ప్రారంభించింది. రష్యాకు ధీటుగా భారీగా బలగాలను మోహరించి కీలక ప్రాంతాల్లో తిరుగుబాటు మొదలు పెట్టింది. రష్యా ఫైటర్‌ జెట్‌ను ఉక్రెయిన్‌ బలగాలు కూల్చివేశాయి. 5 రష్యా విమానాలు, హెలికాప్టర్‌ను కూల్చివేసినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది. ఈ మేరకు ఐదు రష్యా ఎయిర్‌క్రాప్ట్‌, జెట్లు, హెలికాప్టర్లను కూల్చేశామని ఉక్రెయిన్‌ సైన్యం వెల్లడిరచింది. రష్యా యుద్ధం ప్రకటించడంతో ఉక్రెయిన్‌ ప్రభుత్వం మార్షల్‌ లా విధించింది. పౌరులు సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని ఉక్రెయిన్‌ ఆదేశించింది. తమ దేశ భద్రత కోసం సైనికులు పూర్థి స్థాయిలో పోరాడతారని ఉక్రెయిన్‌ ప్రభుత్వం తెలిపింది. మరోవైపు రష్యా బలగాలు ఎయిర్‌ స్టైక్స్‌త్రో పాటు మిస్సైల్స్‌తో ఉక్రెయిన్‌పై అటాక్‌ చేస్తున్నాయి. ఎయిర్‌ డిఫెన్స్‌ కెపాసిటీని కూల్చేశామని రష్యా తెలిపింది. ఆ దేశ సరిహద్దుల్లో సుమారు 1.50 లక్షల మంది సైనికులు మోహరించారు. మరోవైపు బెలారస్‌ సైనికులు కూడా రష్యా దళాలతో చేరారు.ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి భద్రతామండలి మరోసారి అత్యవసరంగా సమావేశమైంది. సైనిక మోహరింపు, తదితర పరిణామాలపై ఈ సమావేశంలో చర్చ సాగింది. యుద్ధ పరిణామాలు ఉక్రెయిన్‌కు వినాశకరమని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చాలా దూరం అవుతాయని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రెస్‌ అన్నారు. మానవతా దృక్పథంతో యుద్దాన్ని ఆపాలని రష్యాను ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలపై రష్యా దాడి నేపథ్యంలో ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రజలు దేశాన్ని విడిచి వెళ్తున్నారు. పెద్ద సంఖ్యలో కార్లలో బయలుదేరిన ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. దీంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడిరది. ప్రధానంగా రాజధాని కీవ్‌ను విడిచి ప్రజలు పారిపోతున్నారు. ఉక్రెయిన్‌లో ప్రముఖులు, రాజకీయ నాయకులు బంకర్లలో తలదాచుకొని ప్రాణాలు రక్షించుకుంటున్నారు. రష్యా దాడులపై ఉక్రెయిన్‌ తీవ్రంగా స్పందించింది. రష్యా పూర్తిస్థాయి యుద్దాన్ని ప్రకటించిందని, ఇది దురాక్రమణ చర్యగా అధ్యక్షుడు జెలెన్‌స్కీ వర్ణించారు. శాంతియుత నగరాలపై దాడులకు పాల్పడుతున్నారని, ప్రపంచ దేశాలు పుతిన్‌ను నిలువరించాలన్నారు. యుద్ధం ఆపడం ఐరాస బాధ్యతనని పేర్కొన్నారు. రష్యా దాడుల నుంచి తమ దేశాన్ని కాపాడుకుంటామని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. ముందుగా దౌత్యపరమైన ప్రయత్నాలే చేస్తామన్న జెలెన్‌ స్కీ.. రెండో ప్రణాళికగా బలగాలను దింపుతామని తెలిపారు. రష్యా మిలిటరీ ఆపరేషన్‌ నేపథ్యంలో ఉక్రెయిన్‌ ప్రజలకు అధ్యక్షడు జెలెన్‌ స్కీ సందేశం అందించారు. రష్యా కేవలం సైనిక స్థావరాలపైనే దాడి చేస్తోందని, సైన్యం తన పని తాను చేసుకుబోతుందన్నారు. ఉక్రెయిన్‌ ప్రజలు భయాందోళనకు గురికావొద్దని తెలిపారు.మరోవైపు ఉక్రెయిన్‌ అధ్యక్షుడితో అమెరికా ప్రెసిడెంట్‌ ఫోన్‌లో చర్చలు జరిపారు. రష్యాపై మరిన్ని కఠిన ఆంక్షలు విధిస్తామని జో బైడెన్‌ తెలిపారు. ఇప్పటికే ఉక్రెయిన్‌కు బ్రిటన్‌,ఫ్రాన్స్‌ మద్దతు తెలిపాయి. రష్యా` ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో శుక్రవారం జీ`7 దేశాలతో జో బైడెన్‌ అత్యవసర సమావేశం నిర్వహించ నున్నారు. నాటో కూటమికి సహకరిస్తామని తెలిపారు.
మేం యుద్దాన్ని కోరుకోవడం లేదు:ఉక్రెయిన్‌ అద్యక్షుడు జెలెన్‌స్కీ
మా గొంతుకను వినండి... ఉక్రెయిన్‌ ప్రజలు శాంతిని కోరుకుంటున్నారని అంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలోడిమిర్‌ జెలెన్‌స్కీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఉక్రెయిన్‌ అధికారులు శాంతిని కాంక్షిస్తున్నారు. మాకు యుద్ధం ఏమాత్రం అవసరం లేదని అంటూ జెలెన్‌స్కీ తీవ్ర భావోద్వేగంతో ప్రకటన చేశారు. తమ జాతిని, రష్యా ప్రజలను ఉద్దేశించి ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. కాగా గత కొన్ని రోజులుగా ఉక్రెయిన్‌పై కన్నెర్ర చేస్తున్న రష్యా.. గురువారం యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సహా పలు దేశాల ప్రముఖులు రష్యా చర్యను ఖండిరచారు. తాజా పరిణామాల వల్ల తీవ్ర నష్టం చవిచూడాల్సి ఉంటుందని అగ్రరాజ్యం హెచ్చరించింది. ఈ పరిణామాల క్రమంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు విడుదల చేసిన వీడియో వైరల్‌ అవుతోంది. ఇందులో భాగంగా తాము యుద్ధం కోరుకోవడం లేదని, అయితే తమను తాము రక్షించుకునే క్రమంలో ప్రతిదాడి చేస్తామని స్పష్టం చేశారు. యుద్ధం అంటే బాధ, బురదలో కూరుకుపోవడం, రక్తపాతం, వేలాది మంది మరణాలు. మాపై దాడి చేయడం ద్వారా మమ్మల్ని దెబ్బకొట్టాలని చూస్తున్నారు. మేము మాత్రం యుద్ధం కోరుకోవడం లేదని రష్యన్‌ భాషలో ప్రసంగించారు. మనం శత్రువులం కాదు.. అయితే ఆత్మరక్షణలో భాగంగా మేము కూడా ప్రతిదాడి చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో పలువురు అంతర్జాతీయ నిపుణులు వోలోడిమిర్‌ జెలెన్‌స్కీ వ్యవహార శైలిని ప్రశంసిస్తున్నారు. ఆయన ప్రసంగం హృదయాలను కదిలించిందని, శాంతిని కోరుకునే తత్వంతో చరిత్రలో నిలిచిపోతారంటూ సోషల్‌ విూడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఉక్రెయిన్‌కు సంఫీుభావం ప్రకటిస్తున్నారు. మరోవైపు బ్రిటన్‌, ఫ్యాన్స్‌ ఉక్రెయిన్‌కు ఇప్పటికే మద్దతు ప్రకటించాయి. ఇదిలా ఉండగా తాను ప్రపంచదేశాధినేతలతో చర్చలు జరుపుతున్నానన్న జెలెన్‌స్కీ... ప్రపంచం తమకు అండగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పోరాడే వారందరికి ఆయుధాలిస్తాం
ఉక్రెయిన్‌కు మద్దతిచ్చే ప్రతి ఒక్కరికి ఆయుధాలిస్తామని ఆ దేశ అధ్యక్షుడు వోలోడిమిర్‌ జెలెన్‌స్కియి ప్రకటించారు. రష్యా దాడులతో తీవ్రంగా నష్టపోయిన ఉక్రెయిన్‌.. తమను తాము రక్షించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. దేశాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే సైనికులతో పాటు పౌరులను కూడా యుద్ధరంగంలోకి దించేందుకు సిద్ధమైంది. రష్యా దూకుడు పసిగట్టి బుధవారమే దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించిన ఉక్రెయిన్‌.. గురువారం ఉదయం ప్రారంభమైన రష్యా దాడిని మాత్రం ఎదుర్కోలేకపోయింది. దేశాన్ని కాపాడాలనుకునే ఎవరికైనా ఆయుధాలు ఇస్తాం. దేశంలోని నగరాలతో పాటు దేశ నలుమూలలను కాపాడుకోవడానికి సిద్ధంగా ఉండాలని వోలోడిమిర్‌ జెలెన్‌స్కియి గురువారం ట్వీట్‌ చేశారు. కాగా, రష్యా ప్రారంభించిన యుద్ధంలో 40 మంది ఉక్రెయిన్‌ సైనికులు, 10 మంది ఉక్రెయిన్‌ పౌరులు, 50 మంది సైనికులు చనిపోయినట్లు ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ వర్గాలు వెల్లడిరచాయి. ఇదిలావుంటే తమ దేశంపై దాడి చేసిన రష్యా సైనికుల్లో ఇద్దరిని బందీలుగా చేసుకున్నట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది. రష్యా జరిపిన దాడుల్లో ఉక్రెయిన్‌లోని పలు సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. రష్యా బాంబు దాడుల్లో ఉక్రెయిన్‌ రక్షణ కార్యాలయం పూర్తిగా దెబ్బతింది. రష్యా క్షిపణిదాడుల్లో పెద్ద సంఖ్యలో ఉక్రెయిన్‌ పౌరులు చనిపోయారని సమాచారం. తమ ప్రతిదాడుల్లో రష్యా సైనికులు కూడా పెద్ద సంఖ్యలో హతమయ్యారని ఉక్రెయిన్‌ తెలిపింది. మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడులను తక్షణమే నిలిపివేయాలని నాటో హెచ్చరించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రపంచానికే ప్రమాదకరమైన సంకేతమని తెలిపింది. దాడులపై ప్రతీకారాన్ని రష్యా ఎదుర్కోవాల్సి ఉంటుందని నాటో సెక్రటరీ జనరల్‌ జెన్స్‌ స్టోª`టలెన్‌ బెర్గ్‌ హెచ్చరించారు. దాడిని నాటో ఖండిస్తోందని, రష్యా వెంటనే తమ బలగాలను ఉపసంహరించుకోవాలని ఆయన హెచ్చరించారు.
దాడిని సమర్థించుకున్న రష్యా
ప్రస్తుత పరిణామాలు ఉక్రెయిన్‌పై కానీ, ఉక్రెయిన్‌ ప్రజలపై కానీ దాడి చేయాలనే కోరికకు సంబంధించినవి కాదని రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ చెప్పారు. ఉక్రెయిన్‌ను నిర్బంధించినవారు దానిని తమ దేశానికి వ్యతిరేకంగా ఉపయోగించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల నుంచి రష్యాను కాపాడుకోవడానికి సంబంధించనవే ఈ పరిణామాలని తెలిపారు. యూనియన్‌ ఆఫ్‌ సోవియెట్‌ సోషలిస్ట్‌ రిపబ్లిక్స్‌ (యూఎస్‌ఎస్‌ఆర్‌) ఏర్పడినపుడు కానీ, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కానీ, నేడు ఉక్రెయిన్‌లో భాగంగా ఉన్న ప్రాంతాల్లో జీవిస్తున్న ప్రజలు ఏవిధంగా తమ జీవితాలను నిర్మించుకోవా లనుకుంటున్నారో వారిని అడగలేదన్నారు. నేడు ఉక్రెయిన్‌లో జీవిస్తున్న ప్రజలు, ఈ పని చేయాలని కోరుకునే ఎవరైనా, స్వేచ్ఛాయుతంగా ఎంపిక చేసుకునే హక్కును తప్పనిసరిగా వినియోగించుకోగలగాలని చెప్పారు. ఉక్రెయిన్‌పై గురువారం ఉదయం రష్యా దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడులతో సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.
రష్యా దాడిపై ప్రపంచ దేశాల ఆగ్రహం
ఉక్రెయిన్‌లో రష్యా రక్తపాతం సృష్టిస్తున్నది. సరిహద్దు దాటి ఉక్రెయిన్‌లోకి ప్రవేశించిన రష్యా బలగాలు దాడులు చేస్తున్నాయి. రష్యా బాంబు దాడుల్లో వందలాది ఉక్రెయిన్‌ ప్రజలు మృతి చెందారు. రష్యా యుద్ధంతో ఉక్రెయిన్‌ ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించడాన్ని పలు ప్రపంచ దేశాలు తప్పుబట్టాయి. అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌, ఇటలీ, యూకేతో పాటు పలు దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచాయి. రక్తపాతం సృష్టిస్తున్న రష్యాపై ఆయా దేశాల అధ్యక్షులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రెయిన్‌పై రష్యా యుద్దాన్ని ప్రకటించడాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తీవ్రంగా ఖండిరచారు. ఉక్రెయిన్‌ ప్రజలకు తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. రష్యా దాడి అన్యాయమైనది అని ఆగ్రహం వెలిబుచ్చారు. ఉక్రెయిన్‌లో జరిగే విధ్వంసానికి రష్యా మాత్రమే బాధ్యత వహించాలని బైడెన్‌ హెచ్చరించారు. ఉక్రెయిన్‌కు మద్దతుగా ఆయా దేశాల మద్దతు కూడగడు తామని చెప్పారు. రష్యా, ఉక్రెయిన్‌ పరిణామాలను గమనిస్తున్నామని చెప్పారు. శుక్రవారం జీ`7 దేశాలతో సమావేశం ఏర్పాటు చేసినట్లు వెల్లడిరచారు. నాటో కూటమికి సహకరిస్తామని తెలిపారు. ఉక్రెయిన్‌కు మద్దతుగా ఉంటామని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ స్పష్టం చేశారు. రష్యా అధ్యక్షుడు ఉక్రెయిన్‌లో రక్తపాతం సృష్టించడం సరికాదన్నారు. రష్యాకు వ్యతిరేకంగా యూకేతో పాటు దాని మిత్రదేశాలు ఉంటాయన్నారు. ఉక్రెయిన్‌లో రష్యా బాంబు దాడులు తనను తీవ్ర దిగ్భార్రతికి గురి చేశాయని బోరిస్‌ జాన్సన్‌ పేర్కొన్నారు. ఇప్పటికే ఉక్రెయిన్‌లో దాడులపై ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో మాట్లాడాను అని తెలిపారు. ఉక్రెయిన్‌లో జరుగుతున్న విధ్వంసానికి రష్యానే బాధ్యత వహించాలని యూరోపియన్‌ యూనియన్‌ చీఫ్‌ ఉర్సులా వాన్‌ డెర్‌ లియోన్‌ ప్రకటించారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని తీవ్రంగా ఖండిరచారు. రష్యాకు తగిన బుద్ధి చెప్తామన్నారు. అమాయక ప్రజల ప్రాణాలను బలి తీసుకోవడం సరికాదన్నారు. ఉక్రెయిన్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా మిలటరీ దాడి చేయం అన్యాయమని ఇటలీ ప్రధాని మారియో ప్రకటించారు. రష్యా బాంబుల దాడిని ఎవరూ సమర్థించరు అని స్పష్టం చేశారు. ఈ యుద్దాన్ని ఇటలీ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు. నాటో కూటమికి సహకరిస్తామని తెలిపారు. ఉక్రెయిన్‌ ప్రజలకు తమ మద్దతు ఉంటుందన్నారు. రష్యాకు వ్యతిరేకంగా యూరోపియన్‌ యూనియన్‌ దేశాలతో కలిసి పని చేస్తామన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని నాటో సెక్రటరీ జనరల్‌ జెన్స్‌ స్టోª`టలెన్‌ బర్గ్‌ తీవ్రంగా ఖండిరచారు. రష్యా దూకుడు చర్యలపై చర్చించేందుకు నాటో కూటమి సమావేశమవుతుందని తెలిపారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను, విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు భారత ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
శాంతియుత పరిష్కారం కోరుకుంటున్నట్లు భారత్‌ ప్రకటన
ఉక్రెయిన్‌` రష్యా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు భారత్‌ పేర్కొంది. ఉక్రెయిన్‌పై రష్యా దండెత్తిన నేపథ్యంలో ఈ మేరకు స్పందించింది. భారత్‌ ఈ అంశంపై తటస్థ వైఖరి అవలంభిస్తుందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. సమస్యకు శాంతియుత పరిష్కారం కోరుకుంటు న్నట్లు వెల్లడిరచింది. మరోవైపు, ఉక్రెయిన్‌లోని భారతీయుల భద్రతపై దృష్టి పెట్టామని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌లోని తమ రాయబార కార్యాలయం తెరిచే ఉంటుందని స్పష్టం చేసింది. అత్యవసర సమాచారం కోసం.. 24 గంటలు అందుబాటులో ఉండే కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని వివరించింది. ఉక్రెయిన్‌లో తాజా ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అక్కడ చిక్కుకుపోయిన భారతీయుల కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక సూచన చేసింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఎక్కడున్నవారు అక్కడే ఉండాలని, ఎట్టిపరిస్థితుల్లో వేరే ప్రదేశాలకు వెళ్లొద్దని కోరింది. ’ఉక్రెయిన్‌లో తీవ్ర అనిశ్చితి నెలకొంది. భారతీయులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. హాస్టళ్లు, ఇళ్లు, వసతి గృహాలు ఇలా ఎక్కడున్నవారు అక్కడే సురక్షితంగా ఉండండి. పశ్చిమ ఉక్రెయిన్‌ ప్రాంతాల నుంచి రాజధాని కీవ్‌కు బయల్దేరిన వారు తిరిగి విూ ప్రాంతాలకు తాత్కాలికంగా వెళ్లిపోండి’ అని ఉక్రెయిన్‌లోని భారత ఎంబసీ ట్వీట్‌ చేసింది. అలాగే తదుపరి ఎదైనా సమాచారం ఉంటే ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తామని రాయబార కార్యాలయం పేర్కొంది. అప్పటి వరకు ఎక్కడున్నవారు అక్కడే భద్రంగా ఉండాలని తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని భారతీయులను కేంద్రం అప్రమత్తం చేసింది. ఆ దేశంలో తీవ్ర అనిశ్చితితో కూడిన పరిస్థితులు ఉన్నాయని.. ఉక్రెయిన్‌లో ప్రజలు తాము ఉన్న స్థలాల్లోనే ఉండాలని సూచించింది. ఇళ్లు, వసతిగృహాలు, శిబిరాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. ఈ మేరకు భారత రాయబార కార్యాలయం సూచనలు చేసింది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌కు వస్తున్న ప్రజలు వెనక్కి మళ్లాలని కాగా, ఉక్రెయిన్‌ విమానాశ్రయంలో పలువురు భారతీయుల స్వదేశానికి వచ్చేందుకు పడిగాపులు కాస్తున్నారు. విమానాశ్రయంలో సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ’కొన్ని గంటలుగా విమానం కోసం ఎదురుచూస్తున్నాం. భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇక్కడ ఎవరూ స్పందించట్లేదు’ అని వాపోయారు. అయితే, ఉక్రెయిన్‌కు వెళ్లాల్సిన ఎయిర్‌ఇండియా విమానం ఉద్రిక్తతల నేపథ్యంలో.. మార్గమధ్యలో ఉండగానే దిల్లీకి తిరుగుపయనమైంది. అయితే, భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు ఇతర దారులను అన్వేషిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. అక్కడి భారత పౌరులు, విద్యార్థుల సంక్షేమమే తమ తొలి ప్రాధాన్యమని తేల్చిచెప్పింది. రష్యా దాడికి ముందు.. బుధవారం అర్ధరాత్రి ఐరాస భద్రతామండలి నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఉక్రెయిన్‌ సంక్షోభంపై భారత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిణామాలపై జాగ్రత్తగా ముందుకు వెళ్లకపోతే, ఈ ప్రాంతం అస్థిరంగా మారుతుందని హెచ్చరించింది. ఇరు దేశాల మధ్య పరిస్థితులు.. పెను సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉంది. ఈ పరిణామాలతో తీవ్ర ఆందోళన చెందుతున్నాము. ప్రస్తుత పరిస్థితులపై జాగ్రత్తగా ముందుకు వెళ్లకపోతే.. ఈ ప్రాంతంలో శాంతి, భద్రతకు పెను ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ఈ ఉద్రిక్త వాతావరణం మరింత దిగజారేందుకు దోహదం చేసే అన్ని చర్యలకు దూరంగా ఉండాలి. ఈ సంక్షోభం పరిష్కారానికి స్థిరమైన దౌత్య మార్గాలే తగినవని భారత్‌ విశ్వసిస్తోంది. ఈలోగా శాంతి భద్రతల పరిరక్షణకు సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది’ అని భారత్‌ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్‌ తిరుమూర్తి ప్రకటన చేశారు. అంతర్జాతీయ చట్టాలను అనుసరించి ఆయా దేశాలు కుదుర్చుకున్న ఒప్పందాలకు అనుగుణంగా వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని మనదేశం సూచించింది.
ఉక్రెయిన్‌లో చిక్కుకు పోయిన విద్యార్థులు
ఉక్రెయిన్‌లో యుద్ధం ప్రారంభం కావడంతో అక్కడ చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన బిడ్డల క్షేమ సమాచారం కోసం ఆరా తీస్తున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని తన పిల్లలను స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సుమారు 2వేల మంది తెలంగాణ విద్యార్థులు ఉక్రెయిన్‌లో ఉన్నారు. ఆ దేశంలో పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో భారత్‌కు వచ్చేందుకు సిద్ధమైన వారు ఎయిర్పోర్టుల్లోనే చిక్కుకున్నారు. కీవ్‌ నగరానికి చేరుకొనే సరికే.. యుద్ధం ప్రారంభమైందని.. దాంతో ఎయిర్‌పోర్ట్‌లోనే చిక్కుకున్నట్లు తల్లిదండ్రులకు సమాచారం అందింది. ప్రస్తుతం క్షేమంగానే ఉన్నా.. తినేందుకు ఆహారం లేదందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ వారిని స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. మొత్తం 20 మంది భారతీయ విద్యార్థులు చిక్కుకున్నట్లు సమాచారం. క్షేమంగానే ఉన్నా.. ఆహారం, నీళ్లు అందుబాటులో లేవని వారు వాపోయారు. గంట గంటకు పరిస్థితి ఆందోళనకరంగా మారుతున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి స్వదేశానికి రప్పించాలని కోరుతున్నారు. ఉక్రెయిన్‌ దేశంలో తెలంగాణకు చెందిన పలువురు విద్యార్థులు చిక్కుకున్నారు. యాదాద్రి,కరంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఉక్రెయిన్‌లో మెడిసిన్‌ చదువుతున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తుండడంతో వీరంతా ఆందోళన చెందుతున్నారు. రాజధాని కీవ్‌ ఎయిర్‌పోర్ట్‌ను రష్యా సైనికులు ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో ఈ విద్యార్థులు జాఫ్రోజీ కాలేజీలో తలదాచుకున్నారు. దీంతో విద్యార్థి కుటుంబ సభ్యులు భయాందోళన చెందుతున్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థుల్లో సుమారు 350 మంది వరకు తెలుగు వారు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు దాదాపు 400 వరకు తెలుగు విద్యార్థులకు సంబంధించి వారి తల్లిదండ్రులు తమ పిల్లలను క్షేమంగా స్వదేశానికి తీసుకురావాల్సిందిగా అభ్యర్థనలు అందాయని సంబంధిత అధికారులు వెల్లడిరచారు. దీంతో ఉక్రెయిన్‌లోని భారత ఎంబసీ అధికారులను సంప్రదించి విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తరలించాల్సిందిగా కోరినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంఈఏ) పేర్కొంది. ఈ మేరకు ఎంఈఏ అధికారులు ఉక్రెయిన్‌లోని తెలుగు మాట్లాడే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు విద్యార్థుల నివాస చిరునామాలకు సంబంధించి తెలంగాణ ఎన్నారై సెల్‌ అధికారుల నుండి సమాచారాన్ని కూడా కోరారు. ఈ సందర్భంగా ఆంధప్రదేశ్‌, తెలంగాణకు చెందిన సుమారు 350 మంది తెలుగు విద్యార్థులు ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయారని, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయని ఎంఈఏ వెల్లడిరచింది. కాగా, ప్రస్తుతం భారత్‌ నుంచి ఉక్రెయిన్‌కు విమాన సర్వీసులు నడిపిస్తోంది ఒక్క ఎయిరిండియా మాత్రమే. ఇక అక్కడ చిక్కుకుపోయిన మనోళ్లను తరలించేందుకు ఈ నెల 22, 24, 26 తేదీల్లో భారత ప్రభుత్వం మూడు ప్రత్యేక ఎయిర్‌ ఇండియా విమానాలను నడపనున్నట్లు ప్రకటించింది. దీనిలో భాగంగానే బుధవారం కొంతమంది భారత విద్యార్థులను అధికారులు స్వదేశానికి తీసుకొచ్చారు. మరోవైపు ఉక్రెయిన్‌ సంక్షోభం విషయంలో భారత్‌ తటస్థంగా వ్యవహరిస్తుండటాన్ని స్వాగతిస్తున్నట్లు రష్యా పేర్కొంది. ఇదిలాఉంటే.. గురువారం ఉదయం ఉక్రెయిన్‌పై రష్యా వార్‌ మొదలెట్టింది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ నగరంపై రష్యా బాంబుల వర్షం కురిపించింది. ఉక్రెయిన్‌ దేశంపై మిలటరీ ఆపరేషన్‌ మొదలైందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రకటించారు. ఇప్పటికే రష్యా బలగాలు కీవ్‌ విమానాశ్రయాన్ని అక్రమించినట్లు తెలుస్తోంది. అటు రష్యా దాడులను ఉక్రెయిన్‌ సేనలు తిప్పి కొడుతున్నాయి.