` ఆర్‌బిఐ వడ్డీరేట్లు యధాతథం
` ద్రవ్యపరపతి విధానంపై గవర్నర్ శక్తకాంత్ దాస్ ప్రకటన
ముంబయి,ఫిబ్రవరి 10(జనంసాక్షి): ప్రైవేట్ క్రిప్టోకరెన్సీల వల్ల స్థూల ఆర్థిక వ్యవస్థకి ముప్పు కలుగుతుందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. వీటివల్ల దేశ ఆర్థిక సుస్థిరతకు విఘాతం కలుగుతుందన్నారు. సవాళ్ళను ఎదుర్కొనడంలో ఆర్బీఐ సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయని వివరించారు. వీటిలో పెట్టుబడి పెట్టేవారు తమ స్వంత రిస్క్‌తోనే ఆ పని చేస్తున్నట్లు గుర్తుంచుకోవాలని కోరారు. అప్రమత్తంగా ఉండాలని పెట్టుబడిదారులను హెచ్చరించడం తన కర్తవ్యమని తెలిపారు. క్రిప్టోకరెన్సీకి ఎటువంటి ఆధారాలు లేవని పెట్టుబడిదారులు గమనించాలని చెప్పారు. అది కనీసం టులిప్ అయినా కాదన్నారు. 17వ శతాబ్దంలో టులిప్ మానియా నడిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఫైనాన్షియల్ బబుల్‌కు ఉదాహరణగా దీనిని చెప్తూ ఉంటారు. వాస్తవ విలువ కారణంగా కాకుండా స్పెక్యులేటర్ల కారణంగా టులిప్ విలువ పెరుతూ ఉండేది. ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య విధాన సవిూక్షను శక్తికాంత దాస్ ప్రకటించారు. రెపో, రివర్స్ రెపో రేట్లను యథాతథంగా కొనసాగించారు. ఈ సందర్భంగా క్రిప్టోకరెన్సీల గురించి మాట్లాడారు. ప్రైవేటు క్రిప్టోకరెన్సీలు లేదా విూరు ఏ పేరు పెట్టి పిలిచినా సరే, అవి మన స్థూల ఆర్థిక వ్యవస్థ సుస్థిరతకు, ఆర్థిక సుస్థిరతకు పెను ముప్పు కలిగిస్తాయన్నారు. ఆర్థిక సుస్థిరత, మేక్రోఎకనమిక్ సుస్థిరత సమస్యలను ఎదుర్కొనడంలో ఆర్బీఐ సామర్థ్యానికి విఘాతం కలిగిస్తాయని చెప్పారు. ద్వైమాసిక ద్రవ్య విధాన సవిూక్షలో గృహ, ఆటో రుణాల గ్రహీతలకు ఉపశమనం లభించలేదు. సవిూప భవిష్యత్తులో వీరి ఈఎంఐలు తగ్గే అవకాశం లేదు. 2022 బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రతిపాదించిన అనంతరం ఈ సవిూక్ష జరిగింది. 2021`22 ఆర్థిక సంవత్సరంలో ఇదే చివరి సవిూక్ష కానుంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన మంగళవారం నుంచి సవిూక్ష నిర్వహించారు. వీరంతా ఏకగ్రీవంగా ఈ రేట్లను మార్చకూడదని నిర్ణయించారు. వృద్ధికి ఊతమివ్వడం కోసం ద్రవ్యోల్బణాన్ని నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ఉండటం కోసం అవసరమైనంత వరకు ఇదే ధోరణిని కొనసాగించాలని నిర్ణయించింది. కమర్షియల్ బ్యాంకులకు నిధులను సమకూర్చినపుడు ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటును రెపోరేటు అంటారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఆర్బీఐ ఉపయోగించే సాధనమిది. బ్యాంకుల నుంచి ఆర్బీఐ రుణాలను తీసుకున్నపుడు ఆ బ్యాంకులకు ఆర్బీఐ చెల్లించే వడ్డీ రేటును రివర్స్ రెపో రేటు అంటారు. ఈ సారి కూడా వడ్డీ రేట్లలో మార్పులు చోటుచేసుకోలేదు. కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు శక్తిదాస్ గురువారం వెల్లడిరచారు. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సవిూక్ష నిర్ణయాలను ఆయన వెల్లడిరచారు. రెపో రేటు 4 శాతం, రివర్స్ రెపో రేటును 3.35 శాతం యధావిధిగా కొనసాగిస్తున్నట్లు చెప్పారు. కాగా, కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడం ఇది పదోసారి. ఆర్థిక వృద్ధికి తోడ్పాటునందించేందుకు ఈ సారి ఇటుంటి నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను ఊతమిచ్చేందుకు 2020 మే నెలలో రెపో రేటును 4 శాతానికి కుదిస్తూ ఆర్‌బిఐ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఈ సమావేశంలో వృద్ధి రేటు అంచనాలను 9.2 శాతానికి కుదించింది. డిసెంబర్ నాటి సమావేశంలో ఇది 9.5 శాతంగా అంచనా వేసింది. 2022`23 ఆర్థిక సంవత్సరానికి 7.8 శాతం వృద్ధిని అంచనా వేసింది.