యడ్లపాటి మృతికి టిడిపి నేతల సంతాపం


ఆయన మృతి పార్టీకి తీరని లోటన్న యనమల

యడ్లపాటికి నివాళి అర్పించన పలువురునేతలు
అమరావతి,ఫిబ్రవరి28 ( జనం సాక్షి):  రాజకీయాల్లో నైతిక విలువలు కల్గిన వ్యక్తి యడ్లపాటి వెంకట్రావు అని మాజీమంత్రి, టిడిపినేత యనమల రామకృష్ణుడు అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ విూడియాతో మాట్లాడుతూ టీడీపీ సీనియర్‌ నేత యడ్లపాటి వెంకట్రావు మృతి బాధాకరమన్నారు. ప్రజాప్రతినిధిగా ప్రజలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, మంత్రిగా పార్లమెంట్‌ సభ్యునిగా రాష్ట్ర అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. రాజకీయాల్లో నైతిక విలువలు కల్గిన వ్యక్తి అని, జీవితాంతం నీతి నిజాయతీతో హుందాగా వ్యవహరించారన్నారు. యడ్లపాటి మృతి పార్టీకి తీరని లోటన్నారు. వెంకట్రావు ఆత్మకు శాంతి చేకూరాలని యనమల కోరుకుంటూ.. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.యడ్లపాటి వెంకట్రావు మృతి బాధాకరమని, పార్టీకి తీరని లోటని కిమిడి కళా వెంకట్రావు అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ విూడియాతో మాట్లాడుతూ ప్రజాప్రతినిధిగా, ప్రజలకు నాయకుడిగా పార్టీకి యడ్లపాటి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. రైతు కుటుంబంలో జన్మించిన వెంకట్రావు అంచలంచెలుగా ఎదిగారని, మంత్రిగా, పార్లమెంట్‌ సభ్యునిగా రాష్ట్ర అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. ఆయన జీవితం నేటి తరం రాజకీయ నాయకులకు ఆదర్శమన్నారు. వెంకట్రావు ఆత్మకు శాంతి చేకూరాలని కళా వెంకట్రావు కోరుకుంటూ.. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మా కుటుంబానికి అత్యంత ఆప్తులు యడ్లపాటి వెంకటరావు మరణించడం బాధాకరమన్నారు. రాష్ట్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యులుగా ప్రజలకు ఆయన ఎనలేని సేవలు అందించారన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని అలాగే ఆయన కుటుంబానికి మనోధైర్యం
ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని టీడీపీ నేత కోడెల శివరాం పేర్కొన్నారు. యడ్లపాటి వెంకట్రావు విలువలు గల రాజకీయ వేత్త అని.. జిల్లాకు ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కన్నారు. యడ్లపాటి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఏ పదవి చేపట్టినా.. దానికి వన్నె తెచ్చిన నేత అని కొనియాడారు. వివాదరహితుడు, రైతు బాంధవుడిగా పేరు గాంచారన్నారు. యడ్లపాటి ఆత్మకు శాంతి చేకూరలని వేడుకుంటున్నానని పుల్లారావు పేర్కొన్నారు. రాజకీయ కురువృద్ధుడు, రైతు నాయకులు యడ్లపాటి వెంకట్రావు మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటు అని టీడీపీ నేత ధూళిపాళ్ళ నరేంద్ర పేర్కొన్నారు. తన తండ్రి స్వర్గీయ ధూళిపాళ్ళ వీరయ్య చౌదరి హయాం నుంచి తమ కుటుంబానికి యడ్లపాటి వెంకట్రావుతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఎన్‌జీ రంగా అడుగుజాడల్లో నడిచి రైతు సమస్యలను అప్పటి ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరించిన రైతు నాయకుడు యడ్లపాటి అని నరేంద్ర కొనియాడారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఓ గొప్ప నాయకుడిని కోల్పోయిందన్నారు. తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా, మంత్రిగా, రాజ్యసభసభ్యులుగా ఎన్నో ఉన్నతమైన పదవులను అలకరించారని నరేంద్ర పేర్కొన్నారు.