యడ్లపాటి మృతికి చంద్రబాబుసంతాపం

భౌతికకాయం వద్ద నివాళి..కుటుంబ సభ్యులకు ఓదార్పు

సంతాపం తెలిపిన రామకృష్ణ,జనసేన నేత నాదెండ్ల
అమరావతి,ఫిబ్రవరి28  ( జనం సాక్షి): మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యులు యడ్లపాటి వెంకట్రావు మృతి కి తెలుగుదేశంపార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన యడ్లపాటి రాజకీయ జీవితం ఎంతో ఆదర్శ ప్రాయంగా సాగిందని చంద్రబాబు పేర్కొన్నారు. మంత్రిగా, జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా, రాజ్యసభ సభ్యునిగా సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగిన యడ్లపాటి... తాను చేపట్టిన పదవులకు వన్నెతెచ్చారని అన్నారు. యడ్లపాటి వెంకటరావు జీవితం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. తనకు వ్యక్తిగతంగా యడ్లపాటితో ఉన్న అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లో అరుదైన వ్యక్తిగా యడ్లపాటి ఎప్పటికీ గుర్తుండి పోతారని చంద్రబాబు తెలిపారు. యడ్లపాటి కుంటుంబ సభ్యులకు చంద్రబాబు సానుభూతి తెలియజేస్తూ.. వెంకట్రావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. యడ్లపాటి వెంకటరావు భౌతికకాయనికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. కుటుంబాన్ని ఓదార్చి సానుభూతి ప్రకటించారు. అనంతరం బాబు మాట్లాడుతూ యడ్లపాటి ప్రజల కోసం తాపత్రయ పడ్డారన్నారు. అలాంటి నేతలు చాలా అరుదుగా ఉంటారని, అధికారం కావాలని ఏనాడు కోరుకోలేదని తెలిపారు. సంఘం డైరీ స్థాపనకు కృషి చేశారన్నారు. ఎప్పుడు నవ్వుతూ ఉండే వ్యక్తి, అజాత శత్రువు యడ్లపాటి అని కొనియాడారు. పదవులకు వన్నె తెచ్చిన వ్యక్తి అని అన్నారు. యడ్లపాటి వెంకటరావు మృతి బాధాకరమని చంద్రబాబు నాయుడు ఆవేదన చెందారు. యడ్లపాటి వెంకటరావు మృతి పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఇతర రాజకీయ ప్రముఖులు, మాజీ
మంత్రులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితరులు స్పందించి సంతాపం ప్రకటించారు. టీడీపీ సీనియర్‌ నేతలు కళా వెంకటరావు, ప్రత్తిపాటి పుల్లారావు, ధూళిపాళ్ల నరేంద్ర తదితరులు స్పందించి సంతాపం ప్రకటించారు. యడ్లపాటి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మాజీ మంత్రి యడ్లపాటి వెంకట్రావు మరణం పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ సంతాపం తెలిపారు. సంగం డైరీ వ్యవస్థాపక అధ్యక్షులుగా, రైతు నాయకునిగా, టీడీపీ సీనియర్‌ నేతగా బాధ్యతలు నిర్వహించిన యడ్లపాటి వెంకట్రావు మరణం బాధాకరమన్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా వెంకట్రావు అందించిన సేవలు ఎనలేనివని కొనియాడారు. యడ్లపాటి వెంకట్రావు మరణం పట్ల ప్రగాఢ సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నామని రామకృష్ణ అన్నారు. ప్రజా జీవితంలో విశేష అనుభవం ఉన్న నాయకులు యడ్లపాటి వెంకట్రావు తుది శ్వాస విడిచారనే విషయం బాధ కలిగించిందని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో రాష్ట్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా, గుంటూరు జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా వెంకట్రావు చేసిన సేవలు మరువలేనివని చెప్పారు. తెనాలి, వేమూరు ప్రాంతాలతో ఆయనకున్న అనుబంధం విడదీయలేనిదని పేర్కొన్నారు. వ్యవసాయ రంగం, పాడి పరిశ్రమల అభివృద్ధి కోసం ఎన్నో ఆలోచనలు చేశారని గుర్తుచేశారు. వెంకట్రావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ... వారి కుటుంబానికి నాదెండ్ల ప్రగాఢ సానుభూతిని తెలిపారు.