అధికారమిస్తే ఉచిత విద్య
` బండి సంజయ్
హైదరాబాద్,మార్చి 6(జనంసాక్షి): తెలంగాణలో భాజపా అధికారంలోకి రాగానే ఉచిత విద్య, వైద్యం అందిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. జైలుకు వెళ్తాననే భయంతోనే సీఎం కేసీఆర్ రాష్ట్రాల పర్యటన చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చంపాపేటలో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ భాజపా కార్యకర్తల సమావేశంలో సంజయ్ మాట్లాడారు. మంత్రి కేటీఆర్‌ను సీఎం చేయాలనుకుంటున్న కేసీఆర్‌కు ఇంటిపోరు ఎక్కువైందన్నారు. అక్రమ కేసులకు భాజపా కార్యకర్తలు భయపడరని చెప్పారు. భాజపా అధికారంలోకి వచ్చాక దారుసలాంను ఆక్రమిస్తామని.. భాగ్యలక్ష్మీ దేవాలయాన్ని తెలంగాణ ఐకాన్‌గా పునర్నిర్మిస్తామన్నారు. హైదరాబాద్ పార్లమెంట్ సీటు గెలవటమే భాజపా లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్రఅధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అక్రమ కేసులకు భాజపా కార్యకర్తలు భయపడరని స్పష్టం చేశారు. పాతబస్తీలో గణేశ్ నిమజ్జనం కార్యక్రమానికి కేసీఆర్, అసదుద్దీన్ లు ఎందుకు హాజరుకావటం లేదని ప్రశ్నించారు. భాజపాకు అవకాశం ఇస్తే ఓల్డ్ సిటీని న్యూ సిటీగా చేసి చూపిస్తామన్నారు. పాతబస్తీలో హిందువుల ఘర్ వాపసీ కార్యక్రమం మొదలు పెడతామని బండి సంజయ్ తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ... కల్వకుంట్ల కుటుంబం పోయి భాజపా ప్రభుత్వం రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు భాజపా భయపడదని స్పష్టం చేశారు. తన పాలనలో అన్ని వర్గాలను మోసం చేయడమే కేసీఆర్ తీసుకొచ్చిన గుణాత్మక మార్పు అని ఎద్దేవా చేశారు. దళితులను వెన్నుపోటు పొడవటం, సచివాలయానికి రాకుండా పాలన చేయడమే కేసీఆర్ గుణాత్మకమైన పాలనంటూ దుయ్యబట్టారు.