పోడు భూముల పట్టాలు కోసం సిపిఐ ధర్నా


- తహశీల్దార్ కు వినతి పత్రం అందజేత 

అశ్వరావుపేట రూరల్, ఫిబ్రవరి3(జనం సాక్షి)
 అశ్వారావుపేట మండల పరిధిలో నాలుగు దశాబ్దాలుగా పేదలు సాగు చేసుకుంటున్న భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక ఫారెస్ట్ రేంజ్ కార్యాలయాన్ని ముట్టడించారు. మండల వ్యాప్తంగా సిపిఐ కార్యకర్తలు ప్రజలు  ఎర్రజెండాలు చేతబూని పట్టణంలో ర్యాలీ నిర్వహించి అటవీ శాఖ కార్యాలయం ముందు, తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా నాయకులు సయ్యద్ సలీం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 ఏళ్ళు దాటుతున్నా రాష్ట్రంలో భూమిని నమ్ముకుని పోడు వ్యవసాయంపై ఆధారపడ్డ ఆదివాసీ, గిరిజన ఇతర నిరుపేద రైతుల బతుకులు ఇంకా ఆటవిక సమాజంలోనే ఉన్నాయని,వర్షాధారంగా నేలతల్లిని నమ్ముకుని పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులపై ప్రతిరోజు ఏదో ఒకచేట లాఠీలు విరుగుతూనే ఉన్నాయని, తాత ముత్తాతల నుండి వ్యవసాయం చేసుకుంటున్నచోట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరితహారం పేరుతో పోడు రైతుల వచ్చని పంటలను యంత్రాలతో ధ్వంసంచేస్తూ నష్టంచేస్తుందని, కందకాలు తవ్వుతూ భూములను గుంజుకుంటున్నారని,ఎదురు నిలబడితే అమాయక ఆదివాసీలపై అక్రమకేసులు బనాయించి జైళ్ళకు పంపుతున్నారని వారు విమర్శించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, సాగుదారులపై పెట్టిన అక్రమకేసులు ఎత్తివేయాలని,నిర్భందాలు ఆపాలని,2006 అటవీ హక్కుల చట్టాన్ని పకడ్బందీగా అమలుచేయాలని, పోడు పంటల విధ్వంసం కందకాలు తవ్వకాలు నిలిపివేయాలని, ముఖ్యమంత్రి హామీ మేరకు ఇటీవల గ్రామ సభలలో తీసుకున్న పోడు దరఖాస్తులు పరివీలనచేసి హక్కు పత్రాలు మంజూరు చేయాలని, అటవీహక్కుల చట్టం నీరుకార్చటానికి మోడి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన అటవీ విధానాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అటవీ రేంజ్ అధికారిఅబ్దుల్ రెహమాన్, స్థానిక తహశీల్దార్ కు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి గన్నిన రామక్రిష్ణ,వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు వడ్లమూడి నాగేశ్వరరావు,మండల రైతు సంఘం అధ్యక్షులు  సాల్వ రవి,గారు, మండల ఏఐటీయూసీ అధ్యక్షులు తిర్నాటి సత్యనారాయణ, సయ్యద్ రఫీ, చీపుర్ల సత్యవతి, వాంకుడోత్ శోభన్, సంఘం కృష్ణమూర్తి, తోడం బుచ్చప్ప, వగ్గెల అర్జున్ రావు,తాటి పాపారావు, పాడే రామారావు,షేక్ బాబు,సజ్జ శ్రీను, గుండ్ల బాబురావు తదితరులు పాల్గొన్నారు.