మెడికల్‌ కళాశాల నిర్మాణం కోసం స్థలాన్వేషణ


మరుగుశుద్ది ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి

రామరాజు పల్లికి బస్‌ సర్వీస్‌ను ప్రారంభం

జనగామ,మార్చి4 (జనం సాక్షి ) : జిల్లా కేంద్రంలో మెడికల్‌ కళాశాల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని సేకరించాలని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు జిల్లా కలెక్టర్‌ శివలింగయ్యను ఆదేశించారు. రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన అవసరమైన దవాఖానలు నిర్మించడంతో పాటు.. సుశిక్షితులైన వైద్యాధికారులుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో రాష్ట్రంలో మెడికల్‌ కళాశాలల ఏర్పాటు జరుగుతుందన్నారు. జనగామలో మెడికల్‌ కళాశాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి హావిూలో భాగంగా  కేబినెట్‌ సమావేశంలో అమోదం లభిస్తుందన్నారు. త్వరలోనే నిర్మాణ పనులను ప్రారంభించేందుకు అనువైన స్థలాన్ని సేకరించాలన్నారు. జనగామ`సిద్దిపేట మార్గంలో స్థలాన్ని పరిశీలించారు.  సీఎం కేసీఆర్‌ సారథ్యంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచిందని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు.  జనగామ మున్సిపాలిటీ పరిధిలోని చంపక్‌ హిల్స్‌లో 2 కోట్ల 30 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మానవ విసర్జితాల శుద్ధీకరణ ప్లాంట్‌ను జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జెడ్పీ చైర్మన్‌ సంపత్‌ రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ పోకల జమున, జనగామ కలెక్టర్‌ శివలింగయ్యలతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత రాష్ట్రంగా తీర్చిదిద్ది..తెలంగాణ రాష్టాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలిపిన సీఎం కేసీఆర్‌ ఆదర్శనీయుడన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎడారిగా ఉన్న జనగామ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన మహనీయుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జనగామ ప్రజలు అండగా ఉండాలన్నారు. జనగామ జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిపేందుకు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ చంద్రమౌళి కౌన్సిలర్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు. మరోవైపు మనఊరు..మనబడి కార్యక్రమంలో భాగంగా రామరాజుపల్లి వచ్చిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావును విద్యార్థులు కలిసి తమ గ్రామానికి  బస్సు సర్వీస్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. వెంటనే చర్య తీసుకుంటామని మంత్రి హావిూ ఇవ్వడమే గాక ఆర్టీసీ అధికారులను ఆదేశించడంతో బస్‌ సర్వీస్‌ను కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి శుక్రవారం రామరాజుపల్లికి విచ్చేసి బస్‌ సర్వీస్‌ ను ప్రారంభించడంతో విద్యార్థుల్లో సంతోషం వెల్లివిరిసింది. స్వయంగా మంత్రితో బస్‌ఎక్కి కృతజ్ఞతలు తెలిపారు.ఇచ్చిన మాట తప్పేదే లేదని ప్రజలు కూడా సహకరించి విద్యార్థులను ప్రభుత్వ బడులకే పంపాలని, తద్వారా విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యతో పాటు, తల్లిదండ్రులకు ఆర్థికభారం తగ్గుతుందని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.