1.15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నిక
` 25న ప్రమాణం చేయించనున్న చీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ
న్యూఢల్లీి(జనంసాక్షి): భారతదేశ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. దేశ అత్యున్నత పదవిని తొలిసారి ఓ ఆదివాసీ మహిళ అధిరోహించనుంది. భారత ప్రథమ పౌరురాలిగా ద్రౌపది ముర్ము ఎన్నిక య్యారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించారు. ప్రతిభా పాటిల్ తరవాత రెండో మహిళగా అత్యున్నత పీఠం అధిరోహించబోతున్నారు. అయితే తొలిసారిగా ఓ గిరిజన మహిళగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించబోతున్నారు. అనూహ్యంగా ఎన్‌డిఎ మద్దతుదారులను మించి ఓటేయడంతో భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముభారీ విజయం సాధించారు. భారత రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి గిరిజన మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. ఓ గిరిజన మహిళను, అదీ అస్సలు ఇంతవరకు అవకాశం లేని తెగనుంచి ద్రౌపది ముర్మను బరిలోకి దింపి బిజెపి దార్శనికతను చాటింది. దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన రెండో మహిళగా ముర్ము నిలిచారు. ఎన్డీఏ అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల్లో బరిలో దిగిన ఆమె విజయ దుందుభి మోగించారు. సగానికి పైగా ఓట్లు సాధించిన ముర్ము ప్రత్యర్థి యశ్వంత్ సిన్హాపై భారీ మెజార్టీతో గెలుపొందారు. సగానికి పైగా ఓట్లు సాధించారు. ఆమె రాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో ఎన్‌డిఎ శ్రేణులు సర్వత్రా ఆనందం వ్యక్తం చేశారు. సంబరాలు చేసుకున్నారు. ముర్ము విజయం సాధించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆమెతో భేటీ అయి, అభినందించారు. రాష్ట్రపతిగా విజయం సాధించిడంపై ఆమెను అభినందించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, భాజపా చీఫ్ జేపీ నడ్డా,పలువురు కేంద్రమంత్రులు సహా పలువురు నేతలు కూడా ముర్మును కలిసి అభినందనలు తెలిపారు. సోమవారం ప్రమాణస్వీకారం జరగనున్న నేపథ్యంలో జేపీ నడ్డా పార్టీ నేతలు, భాజపా పాలిత రాష్టాల్ర ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఇదిలావుంటే 25న భారతప్రధాన న్యయామూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ ఆమెతో ప్రమాణం చేయిస్తారు. ఇకపోతే ద్రౌపది ముర్ముకు బీజేపీ, ఎన్డీఏ భాగస్వామ్యపక్షాలతో పాటు బీజేడీ, వైఎస్సార్ కాంగ్రెస్ సహా 44 పార్టీలు మద్దతిచ్చాయి. దీంతో ఆమె ఎలక్టోరల్ కాలేజ్‌లో అవసరమైన మెజార్టీకి మించి ఓట్లు సాధించారు. 63శాతం ఓట్లతో విజయ కేతనం ఎగరవేశారు. ఈ నెల 25న దేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము బాధ్యతలు చేయనున్నారు. మూడో రౌండు కౌంటింగ్ పూర్తయ్యే సరికి ద్రౌపది ముర్ము 50శాతానికి పైగా ఓట్లు సాధించారు. దీంతో ఆమె విజయం లాంఛనమైంది. ఎన్డీఏ అభ్యర్థిగా బరిలో దిగిన ముర్ము ప్రతి రౌండ్ లోనూ ప్రత్యర్థి యశ్వంత్ సిన్హాపై స్పష్టమైన ఆధిక్యం సాధించారు. మూడో రౌండు పూర్తయ్యే సరికి ద్రౌపది ముర్ముకు 5,77,777 ఓట్లురాగా.. యశ్వంత్ సిన్హాకు 2,61,062 ఓట్లు మాత్రమే వచ్చాయి. జులై 25న ద్రౌపది ముర్ము రాష్ట్రపతి పీఠం అధిరోహించనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో దిగారు. ఈ నెల 18న ఓటింగ్ నిర్వహించగా.. ఈ రోజు ఉదయం 11 గంటలకు పార్లమెంటు హౌస్‌లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలుత ఎంపీల ఓట్లు లెక్కించగా.. తొలి రౌండ్‌లోనే ద్రౌపది ముర్ము భారీ ఆధిక్యంతో దూసుకుపోయారు. మొత్తం 763 మంది ఎంపీలు ఓటు వేయగా వారిలో 15 మంది ఓట్లు చెల్లలేదు. మిగిలిన 748 ఓట్లలో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు 540 ఓట్లు వచ్చాయని వాటి విలువ 3,78,000 అని రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోడీ ప్రకటించారు. ఇక విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు 208 ఓట్లు రాగా వాటి విలువ 1,45,600గా లెక్కించారు. అనంతరం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రాష్టాల్ర వారీగా ఎమ్మెల్యేల ఓట్లు లెక్కించగా రెండో రౌండ్ లోనూ ద్రౌపది ముర్ము దూసుకుపోయారు. సెకండ్ రౌండ్ లో 10 రాష్టాల్రకు చెందిన 1138 మంది ఎమ్మెల్యేల ఓట్లు చెల్లుబాటు కాగా.. వాటిలో ద్రౌపది ముర్ముకు 1,05,299 విలువైన 809 ఓట్లు పోలైనట్లు రాజ్యసభ సెక్రటరీ పీసీ మోడీ తెలిపారు. సెకండ్ రౌండ్ లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు కేవలం 329 ఓట్లు మాత్రమే దక్కాయి. ఆయనకు వచ్చిన ఓట్ల విలువ 44,276. ఎంపీలు, 10 రాష్టాల్ర ఎమ్మెల్యేలతో కలుపుకొని చెల్లుబాటైన 1,886 ఓట్ల విలువ 6,73,175 కాగా.. వాటిలో 1,349 ఓట్లు ద్రౌపది ముర్ము ఖాతాలో పడ్డాయి. వాటి విలువ 4,83,299. ఇక సెకండ్ రౌండ్ ముగిసే సరికి యశ్వంత్ సిన్హాకు 1,89,876 విలువైన 537 ఓట్లు మాత్రమే పడ్డాయి. మూడో రౌండులో కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, పంజాబ్ రాష్టాల్ర ఎమ్మెల్యేల ఓట్లు లెక్కించారు. 1,333 ఓట్లు చెల్లుబాటు కాగా.. వాటిలో ద్రౌపది ముర్ముకు 812 , విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు 521 ఓట్లు వచ్చాయి.
2.పాపం కిషన్‌రెడ్డి(కిక్క
ఎన్డీఆర్‌ఎఫ్‌కు,ఎస్‌డీఆర్‌ఎఫ్ తేడా తెలియకుండా కిషన్‌రెడ్డి కేంద్రమంత్రి ఎలా అయ్యారు
` మంత్రి కేటీఆర్ ధ్వజనం
` రాష్ట్రానికి కేంద్రం వరద సహాయంపై కిషన్‌రెడ్డి తప్పుడు లెక్కలు
` కేంద్రం ఎన్డీఆర్‌ఎఫ్ ద్వారా ఇచ్చిన ప్రత్యేక, అదనపు నిధులపై సమాధానం చెప్పాలని డిమాండ్
` 2018 నుంచి తెలంగాణకు ఒక్క రూపాయి అదనంగా ఇవ్వలేదని పార్లమెంటులో కేంద్రమంత్రే స్వయంగా ప్రకటించారు
` ఆ ప్రకటనను కిషన్‌రెడ్డి ఒకసారి చదవాలని హితవు
` బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రానికి ఇచ్చిన ఎన్డీఆర్‌ఎఫ్ అదనపు నిధులు తెలంగాణకు ఎందుకు ఇవ్వడం లేదు
` తెలంగాణ ప్రజల కష్టాలు కనిపించని ప్రధాని మోడీ వివక్షపూరిత వైఖరిని ఎండగడతామని వ్యాఖ్య
హైదరాబాద్(జనంసాక్షి): ఎన్డీఆర్‌ఎఫ్‌కు.. ఎస్డీఆర్‌ఎఫ్‌కు తేడా తెలియని వ్యక్తి కేంద్రమంత్రిగా ఉండం దురదృష్టకరమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్ ప్రత్యేక నిధులపై కిషన్‌రెడ్డికి అవగాహన లేదని, కేంద్రం ఎన్డీఆర్‌ఎఫ్ ద్వారా ఇచ్చిన ప్రత్యేక, అదనపు నిధులపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్టికల్ 280 ప్రకారం రాష్ట్రానికి రాజ్యంగబద్దంగా హక్కుగా దక్కే ఎస్డీఆర్‌ఎఫ్ గణాంకాల పేరుతో కిషన్‌రెడ్డి ప్రజలను గందరగోళపరిచే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎలాంటి విపత్తు లేకుండా ఎస్డీఆర్‌ఎఫ్ నిధులు వస్తాయి.వీటిని తాము ప్రత్యేకంగా ఇచ్చినట్లు కిషన్‌రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని, తెలంగాణ రాష్ట్రానికి రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన ఎస్డీఆర్‌ఎఫ్ వచ్చే నిధులు తప్ప కేంద్రం నుంచి తెలంగాణకు దక్కిందేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. 2018 నుంచి తెలంగాణకు ఒక్క రూపాయి అదనంగా ఇవ్వలేదని లోక్‌సభలో కేంద్ర హోంశాఖ (మినిస్టర్ ఫర్ స్టేట్) నిత్యానంద్ రాయ్ చేసిన ప్రకటనను ఒకసారి చదవాలని కిషన్ రెడ్డికి హితవు పలికారు. ఎవరు తెలంగాణను మోసం చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. 2018 నుంచి ఇప్పటి దాకా బీజేపీ అధికారంలో ఉన్న బీహార్‌కు రూ.3,250 కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ.4,530 కోట్లు, కర్నాటకకు రూ.6,490 కోట్లు, గుజరాత్‌కు రూ.1,000 కోట్లు ఎన్డీఆర్‌ఎఫ్ అదనపు నిధులు అందించిన విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.తాము అధికారంలో ఉన్న నాలుగు రాష్ట్రాలకు రూ.15,270 కోట్లు ఇచ్చిన కేంద్రానికి తెలంగాణకు నిధులు ఇచ్చేందుకు ఎందుకు చేతులు రావడం లేదని నిలదీశారు. గుజరాత్‌లో వరదలు వచ్చినప్పుడు స్వయంగా ప్రధానమంత్రి ఆగమేఘాల విూద సర్వే నిర్వహించి.. 2021లో రూ.1000 కోట్ల ఎన్డీఆర్‌ఎఫ్ ప్రత్యేక అదనపు సహాయాన్ని అడ్వాన్స్ రూపంలో విడుదల చేసింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల కష్టాలు కనిపించని ప్రధాని మోడీ వివక్షపూరిత వైఖరిని ఎండగట్టడాన్ని కొనసాగిస్తామన్నారు. ఆయా రాష్ట్రాల మాదిరే తెలంగాణ రాష్ట్రానికి ఎన్డీఆర్‌ఎఫ్ ద్వారా అందించిన అదనపు నిధులు ఎన్నో దమ్ముంటే కిషన్‌రెడ్డి ప్రకటించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చైర్మన్‌గా ఉన్న హైలెవెల్ కమిటీ ఇచ్చే ఎన్డీఆర్‌ఎఫ్ అదనపు నిధులు అడిగే ధైర్యం లేక కిషన్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. 2018 నుంచి ఇప్పటిదాకా ఒక్కపైసా అదనంగా తెలంగాణకు అందించని తమ కేంద్ర ప్రభుత్వ వివక్షపూరిత వైఖరి నిజమని ఒప్పుకోవాలన్నారు. కేంద్రమంత్రిగా ఉంటూ సొంత రాష్ట్రానికి నయా పైసా సాయం తీసుకురాని చేతకాని మంత్రిగా కిషన్‌రెడ్డి చరిత్రలో మిగిలిపోతారన్నారు. అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న కిషన్‌రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
3.ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో తెలంగాణకు రెండో ర్యాంక్
` వరుసగా మూడోసారి కర్నాటక టాప్
న్యూఢల్లీి,(జనంసాక్షి): భారత ఆవిష్కరణ సూచీల్లో .. తెలంగాణ రెండవ స్థానాన్ని కైవసం చేసుకున్నది. నీతి ఆయోగ్ వైస్ చైర్మెన్ సుమన్ బేరీ ఇవాళ ఇన్నోవేషన్ ఇండెక్స్‌ను రిలీజ్ చేశారు. సీఈవో పరమేశ్వరన్ అయ్యర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్లోబల్ ఇన్నోవేషణ్ ఇండెక్స్ ఆధారంగా ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌ను తీర్చిదిద్దారు. మూడవ సారి నీతి ఆయోగ్ ఈ సూచీలను రిలీజ్ చేసింది. ఈ జాబితాలో కర్నాటక, తెలంగాణ, హర్యానా రాష్ట్రాలు మొదటి మూడు స్థానాలను గెలుచుకున్నాయి. జాతీయ స్థాయిలో ఆవిష్కరణలకు కావాల్సిన సామర్థ్యం, వాతావరణం ఎలా ఉందో గమనించి ఈ ర్యాంకులను ప్రజెంట్ చేస్తారు.వరుసగా మూడవ సారి కర్నాటక టాప్ ప్లేస్‌ను కొట్టేసింది. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్(జీఐఐ) సూత్రాలకు అనుగుణంగా జాతీయ స్థాయి ఆవిష్కరణ సూచీలను రూపొందించారు. దీని కోసం 66 విశిష్టమైన ఇండికేటర్స్‌ను ప్రవేశపెట్టారు. పెద్ద రాష్ట్రాల క్యాటగిరీలో కర్నాటక టాప్ రాగా, ఈశాన్య, పర్వత ప్రాంతాల క్యాటగిరీలో మణిపూర్, కేంద్ర పాలిత ప్రాంతాల క్యాటగిరీలో చండీఘడ్ ఫస్ట్ వచ్చాయి.
4.కాళేశ్వరానికి జాతీయహోదా ఇవ్వలేం
` ప్రాజెక్ట్‌కు ఇన్వెస్ట్‌మెంట్ క్లీయరెన్స్ లేదు
` అందుకే జాతీయహోదా స్కీంలో దానిని చేర్చలే
` ఎంపి ఉత్తమ్ ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వక జవాబు
న్యూఢల్లీి(జనంసాక్షి):కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పించలేమని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేసీఆర్ కోరినట్లు తెలిపిన కేంద్ర గిరిజన సంక్షేమం,జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు అన్నారు. కాళేశ్వరానికి ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ లేదని, అందుకే కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించలేదని పేర్కొన్నారు. జాతీయ ప్రాజెక్టు స్కీంలోకి కాళేశ్వరాన్ని చేర్చే అర్హతలేదని వెల్లడిరచారు. మొత్తంగా జాతీయ హోదాకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టుకు విషయంలో కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేమని తేల్చిచెప్పింది. కాళేశ్వరానికి ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ లేదని.. ఈ నేపథ్యంలో జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్రం స్పష్టం చేసింది. లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని సీఎం కేసీఆర్ 2016, 2018లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. అయితే ఆ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. పర్మిషన్లు ఉంటేనే కాళేశ్వర ప్రాజెక్టును హైపవర్ స్టీరింగ్ కమిటీ పరిశీలిస్తుంది. హైపవర్ కమిటీ అనుమతిస్తేనే జాతీయ హోదా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాళేశ్వరానికి ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ లేదు. జాతీయ ప్రాజెక్టుల జాబితాలో చేర్చే అర్హత దానికి లేదని కేంద్ర జలశక్తి శాఖ సహాయకమంత్రి బిశ్వేశ్వర్ తుడు స్పష్టం చేశారు. జాతీయ హోదా ప్రాజెక్టు పథకంలో ఏ ప్రాజెక్టునైనా చేర్చాలంటే కేంద్ర జలసంఘం అధ్యయనం తప్పనిసరి కేంద్రం చెబుతోంది. ఆ తర్వాత ప్రాజెక్ట్ సలహా కమిటీ ఆమోదం పొందాలని పేర్కొంది. పెట్టుబడుల అనుమతి కేంద్రం నుంచి తీసుకోవాలని తెలిపింది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి అనుమతులు తీసుకోలేదని కేంద్రం అంటోంది. లోక్‌సభలో ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిప్రశ్నకు.. కేంద్ర సహాయ మంత్రి బిశ్వేశ్వర్ లిఖితపూర్వక సమాధానిచ్చారు. కాళేశ్వరరానికి జాతీయ హోదా లభిస్తే.. ప్రాజెక్టు నిర్మాణంలో అనేక ప్రయోజనాలు సిద్ధిస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది.
5.వినాయక విగ్రహాల తయారీ, నిమజ్జనంపై హైకోర్టు కీలక ఆదేశాలు
` పీవోపీ విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయరాదని ఆదేశాలు
హైదరాబాద్(జనంసాక్షి): వినాయక విగ్రహాల తయారీ, నిమజ్జనంపై స్పష్టతనిస్తూ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ) వినాయక విగ్రహాల తయారీపై నిషేధం లేదని స్పష్టం చేసింది.అయితే, పీవోపీ విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయరాదని ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన నీటి కుంటల్లోనే పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయాలని తెలిపింది. విగ్రహాల ఎత్తు తక్కువగా ఉండేలా ఉత్తర్వులు ఇవ్వాలన్న ప్రభుత్వ అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. దుర్గామాత విగ్రహాల నిమజ్జనంపై పశ్చిమ బెంగాల్ మార్గదర్శకాలను పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.గతేడాది పీవోపీ విగ్రహాలపై నిషేధం విధిస్తూ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) మార్గదర్శకాలను జారీ చేసింది. సీపీసీబీ మార్గదర్శకాలను సవాల్ చేస్తూ గణేష్ మూర్తి కళాకార్ సంఫ్‌ు దాఖలు చేసిన పిటిషన్‌పై సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎస్.నంద ధర్మాసనం విచారణ చేపట్టింది. శాస్త్రీయ అధ్యయనం లేకుండా సీపీసీబీ మార్గదర్శకాలు జారీ చేసిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది దుర్గాప్రసాద్ వాదించారు. పీవోపీపై నిషేధం లేదని.. అలాంటప్పుడు కేవలం విగ్రహాల తయారీలో వినియోగించొద్దనడం సమంజసం కాదన్నారు. జీహెచ్‌ఎంసీ బేబీ పాండ్లను (నీటి కుంటలు) సరిగా నిర్వహించలేక.. పీవోపీ విగ్రహాల తయారీ, విక్రయాలు నిలిపివేయాలని కళాకారులపై దాడి చేస్తోందన్నారు. కొవిడ్‌కు ముందు తయారు చేసిన విగ్రహాలనైనా విక్రయించేందుకు అనుమతివ్వాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సీపీసీబీ మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ.. పీవోపీ విగ్రహాలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇవ్వలేదని హైకోర్టు పేర్కొంది. హైకోర్టు ఆదేశాల మేరకు మార్చి వరకు నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా.. ప్రభుత్వం ఇప్పటి వరకు జీవో ఇవ్వలేదని తెలిపింది. ప్రస్తుతం నిషేధం లేనందున.. కొందరి ఉపాధి దెబ్బతినేలా ఉత్తర్వులు ఇవ్వమని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే పీవోపీ విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో మాత్రం నిమజ్జనం చేయరాదని ధర్మాసనం స్పష్టం చేసింది. జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసే బేబీ పాండ్లలో నిమజ్జనం చేసి వెంటనే తొలగించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. హైదరాబాద్‌లో నదులు, సముద్రాలు లేకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తుతోందని పేర్కొంది. కనీసం విగ్రహాల ఎత్తును నియంత్రించేలా ఉత్తర్వులు ఇవ్వాలన్న ప్రభుత్వం న్యాయవాది అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు.. కొత్త అంశాలను తెరపైకి తేవద్దని వ్యాఖ్యానించింది. సీపీసీబీ మార్గదర్శకాల చట్టబద్ధతను తుది విచారణలో తేలుస్తామంటూ విచారణను వాయిదా వేసింది.
6.సోనియాపై ఈడీ ప్రశ్నల వర్షం
` విచారణకు హాజరైన కాంగ్రెస్ అధినేత్రి
` వెంటవచ్చిన రాహుల్,ప్రియాంకలు
` కాంగ్రెస్ శ్రేణుల ఆందోళనతో భారీ భద్రత
` మూడుగంటలపాటు విచారించిన ఈడీ అధికారులు
` సోమవారం మరోమారు విచారణకు రావాలని ఆదేశాలు
న్యూఢల్లీి(జనంసాక్షి): నేషనల్ హెరాల్డ్ అవినీతి కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు సుమారు మూడు గంటల పాటు ప్రశ్నించారు. తదుపరి విచారణకు ఆమె సోమవారం మరోసారి రావాల్సి ఉంటుందని ఈడీ అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 11 గంటలకు సోనియా ఢల్లీిలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. సోనియా వెంట ఆమె తనయుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా ఈడీ కార్యాలయానికి వచ్చారు. మనీ లాండరింగ్ నిరోధక
చట్టంలోని క్రిమినల్ సెక్షన్ల కింద సోనియా వాంగ్మూలాలను ఈడీ అధికారులు నమోదు చేశారు. నేషనల్ హెరాల్డ్ పత్రికలో సోనియా, రాహుల్‌ల షేర్లు, ఆర్థిక లావాదేవీలు, వీరి పాత్రలకు సంబంధించి ప్రశ్నించారు. మరోవైపు సోనియా ఈడీ అధికారుల ఎదుట హాజరైనందుకు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది. రాహుల్ గాంధీ ఈడీ ఎదుట హాజరైనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది. కాంగ్రెస్ పార్టీకి నేషనల్ హెరాల్డ్ పత్రిక బకాయి ఉన్న 90.25 కోట్ల రూపాయలను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు కేవలం 50 లక్షల రూపాయల చెల్లింపుతో యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి గతంలో ఆరోపించారు. సోనియా, రాహుల్ నేషనల్ హెరాల్డ్ ఆస్తుల్ని ఆయాచితంగా పొందారని కూడా స్వామి గతంలో ఆరోపించారు. సోనియా ఆరోగ్య పరిస్థితుల మేరకు సహకారిగా ఉండేందుకు ప్రియాంకకు.. ఈడీ అనుమతి ఇచ్చింది. అయితే విచారణ గది కాకుండా.. మరో గదిలో ఉండేందుకు ప్రియాంకకు అనుమతి ఇచ్చింది.మరోవైపు.. సోనియా గాంధీ ఈడీ విచారణను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్? శ్రేణులు నిరసనలు చేస్తున్నాయి. పార్లమెంట్ వెలుపల, లోపల కూడా సోనియా గాంధీ ప్లకార్డులు పట్టుకొని.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కాంగ్రెస్‌ఎంపీలు. మరోవైపు.. విపక్షాలు కూడా దీనిపై ఓ ప్రకటన విడుదల చేశాయి. కొన్ని పార్టీల ప్రముఖ నేతలే లక్ష్యంగా ప్రయోగిస్తూ.. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డాయి. మోదీ ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులపై దర్యాప్తు సంస్థలను ఉపయోగించి కక్ష సాధిస్తోంది. ఈడీ ద్వారా ప్రతిపక్షాలపై ప్రతీకారాన్ని తీర్చుకుంటోంది. ఉద్దేశపూర్వకంగానే ప్రతిపక్ష నేతలను వేధింపులకు గురి చేస్తోంది. భాజపా తీరును ఖండిస్తున్నాం. మోదీ సర్కార్ ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు సమష్టిగా పోరాటం చేస్తాయని ప్రతిపక్షాలు ప్రకటించారు. సోనియా ఈడీ విచారణ నేపథ్యంలో దిల్లీలో భద్రతను పెంచారు పోలీసులు. ఔరంగజేబ్ మార్గ్, మోతీలాల్ నెహ్రూ మార్గ్, జనపథ్ మార్గ్, అక్బర్ రోడ్‌లను పూర్తిగా మూసివేశారు. కాంగ్రెస్ కార్యకర్తల నిరసనలు చేపడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. కేసులో జూన్ 8నే సోనియా తొలుత విచారణకు హాజరుకావాల్సి ఉంది. జూన్? 2న ఆమెకు కరోనా సోకిన నేపథ్యంలో కొన్నిరోజులు ఐసోలేషన్?లో ఉండి చికిత్స తీసుకున్నారు. అనంతరం.. జూన్ 12న ఆస్పత్రిలో చేరారు. కరోనాతో బాధపడుతున్న కారణంగా విచారణకు హాజరుకాలేనని.. మూడు వారాల గడువు ఇవ్వాలని సోనియా ఈడీని కోరారు. దీంతో జూన్ 23న తమ ముందు విచారణకు హాజరు కావాలని ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. దీంతో పూర్తిగా కోలుకున్న తర్వాతే హాజరవుతానని ఆమె మరోసారి స్పష్టం చేశారు. సోనియా తనయుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఇదే కేసు విషయంలో.. మొత్తం ఐదు రోజుల్లో సుమారు 55 గంటల పాటు ఈడీ విచారించింది. పార్టీ శ్రేణులు దేశవ్యాప్తంగా అప్పుడు కూడా పెద్దఎత్తున నిరసనలు చేపట్టాయి.
7.కేంద్ర వైఫల్యాల దృష్టి మరల్చేందుకే సోనియాను వేధిస్తున్నారు
` కాంగ్రెస్ శ్రేణుల దేశవ్యాప్తంగా ఆందోళనలు
న్యూఢల్లీి(జనంసాక్షి): నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఈడీ ప్రశ్నిస్తున్న నేపధ్యంలో రాజకీయ ప్రత్యర్ధులపై కేంద్ర దర్యాప్తు సంస్ధలను దుర్వినియోగం చేస్తూ కేంద్రం వేధింపులకు గురిచేస్తోందని విపక్షం భగ్గుమంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పే వారి గొంతును మోదీ సర్కార్ నొక్కివేస్తోందని విపక్ష నేతలు ఓ సంయుక్త ప్రకటనలో దుయ్యబట్టారు.దర్యాప్తు సంస్ధలను ప్రయోగించి వివిధ పార్టీలకు చెందిన రాజకీయ ప్రత్యర్ధులపై మోదీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న మోదీ ప్రభుత్వంపై తమ పోరాటం తీవ్రతరం చేస్తామని విపక్ష నేతలు ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.ఈ ప్రకటనపై శివసేన, వీసీకే, డీఎంకే, ఆర్జేడీ, సీపీఐ, సీపీఎం, టీఆర్‌ఎస్, ఆర్‌ఎస్‌పీ సహా పలు పార్టీల నేతలు సంతకాలు చేశారు. అంతకుముందు పార్లమెంట్‌లో రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే కార్యాలయంలో విపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్లు సమావేశమయ్యారు. ఇక సోనియా గాంధీ ఈడీ ఎదుట హాజరయ్యేందుకు ముందు పార్టీ ఎంపీలు పార్లమెంట్ నుంచి పార్టీ ప్రధాన కార్యాలయానికి ప్రదర్శనగా వెళ్లారు. మోదీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆందోళన చేపట్టారు.
సోనియాకు మద్దతుగగా నిలవాలి:రేవంత్ రెడ్డి
తెలంగాణ ఇచ్చిన సోనియాకు జెండాలు,ఎజెండాలకు మద్దతుగా అంతా నిలవాలని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పార్టీలకుఅతీతంగా నిలవాలన్నారు. బిజెపి ఇడిని అడ్డం పెట్టుకుని త్యాగాల కుటుంబాన్ని వేధిస్తోందని అన్నారు. సోనియాపై ఈడీ కేసు నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో... హైదరాబాద్‌లోనూ హస్తం నేతలు ధర్నాకు దిగారు. నెక్లెస్‌రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం నుంచి బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం వరకు కాంగ్రెస్ నేతలు ర్యాలీగా బయల్దేరారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, పలువురు నేతలు ర్యాలీలో పాల్గొన్నారు. ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీని ఈడీ పేరిట కేంద్ర ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. కేంద్ర సర్కార్ హస్తం పార్టీపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్రజాస్వామిక పద్ధతిలో ఈడీ.. సోనియా గాంధీని విచారి స్తోందని విమర్శించారు. ఈ విషయమంతా ప్రజలు గమనిస్తున్నారని.. త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని అన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నల్లదుస్తులు ధరించి ర్యాలీలో పాల్గొన్నారు. కొందరు నేతలు కార్యకర్తలు నల్ల రంగు బెలూన్లు పట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. దారి పొడవునా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్యకర్తలు ర్యాలీ కొనసాగించారు. ర్యాలీ సందర్భంగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిరది. ఇందిరా పార్కు వద్ద కాంగ్రెస్ నాయకులు.. నిరసనలకు వెళ్లకుండా పోలీసులు అరెస్టు చేశారు.ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీని ఈడీ పేరిట కేంద్ర ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని కాంగ్రెస్ నగర అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్ మండిపడ్డారు. ఆదర్శనగర్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అంజన్ కుమార్ నల్ల దుస్తులు, బెలూన్స్ ప్రదర్శిస్తూ బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి తరలివెళ్లారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. సోనియా గాంధీని ఈడీ పేరుతో కేంద్ర ప్రభుత్వం వేధించడాన్ని ఆయన ఖండిరచారు. ఇలాంటి చర్యలతో కేంద్రం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఏల్పీ నేత భట్టి, మధుయాష్కీ, అంజన్ కుమార్ యాదవ్, పొన్నాల లక్ష్మయ్య,, షబ్బీర్ అలీ నిరసన దీక్షలో పాల్గొన్నారు. కాంగ్రెస్ నిరసనతో బషీర్ బాగ్ రూట్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
డబ్బు బదలాయింపు లేకున్నా..సోనియా కుటుంబంపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి కేంద్రం వేధింపులకు గురిచేస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మానసికంగా ఇబ్బంది పెట్టి.. గాంధీ కుటుంబం
దేశం విడిచిపోయేలా చేయాలని కేంద్రం భావిస్తోందని చెప్పారు. సోనియా గాంధీ కుటుంబానికి పార్టీ నాయకులు, శ్రేణులు అండగా ఉంచాయన్నారు. ఈడీ కేసు గురించి క్లుప్తంగా..నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆస్తులను ఆయాచితంగా పొందారని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది. మాజీ ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, ఇతర స్వాతంత్ర సమరయోధులు కలిసి 1938లో ఈ పత్రికను స్థాపించారు. దీని ప్రచురణ సంస్థ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్(ఏజేఎల్)కు హిందీ, ఉర్దూలలోనూ మరో రెండు పబ్లికేషన్లు ఉన్నాయి. రూ.90 కోట్లకు పైగా అప్పులు పేరుకుపోవడంతో 2008లో ఈ పత్రిక మూతపడిరది. ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ(ఏజేఎల్)ని ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ(యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్`వైఐఎల్) ద్వారా సొంతం చేసుకున్నారని సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించారు. ఏజేఎల్ బకాయి పడిన రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును పొందడానికి వైఐఎల్ ద్వారా రూ.50 లక్షలు చెల్లించి.. కుట్ర, మోసం, నిధుల దుర్వినియోగానికి వీరు పాల్పడ్డారన్నారు.
9.బోర్డింగ్ పాస్‌లకు ఫీజులొద్దు..
విమాన సంస్థలకు కేంద్రం సూచన
దిల్లీ(జనంసాక్షి):విమాన ప్రయాణికుల నుంచి చెక్`ఇన్ కౌంటర్ల వద్ద తీసుకునే బోర్డింగ్ పాస్‌లకు ఎలాంటి ఫీజులూ వసూలు చేయొద్దని కేంద్రం పౌర విమానయాన శాఖ సూచించింది.కొన్ని సంస్థలు బోర్డింగ్ పాస్‌ల జారీకి ఫీజులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. ఎయిర్‌క్రాఫ్ట్ రూల్స్ 1937 ప్రకారం.. ఎలాంటి అదనపు రుసుములూ వసూలు చేయకూడదని విమాన సంస్థలకు స్పష్టంచేసింది.ఇండిగో, స్పైస్‌జెట్, గో ఫస్ట్ వంటి విమాన సంస్థలకు ప్రయాణికుల వద్ద నుంచి బోర్డింగ్ పాస్ కోసం ?200 చొప్పున వసూలు చేస్తున్నాయి. ఈ విషయం పౌర విమానయాన శాఖ దృష్టికి రావడంతో ఈ విధంగా స్పందించింది. విమాన ప్రయాణికులను వెబ్ చెక్`ఇన్ చేసుకునే విధంగా ప్రోత్సహించాలని గతంలో కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. బోర్డింగ్ పాసులకు ఫీజులు వసూలు చేయడమనేది ఆ ఉత్తర్వులకు విరుద్ధంగా ఉందని తెలిపింది.
10.పాల ఉత్పత్తులపై కూడా జీఎస్టీ విధిస్తే ఇక ప్రజలేం తింటారు?
` రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేందుకు కాషాయ పార్టీ కుట్ర
` భాజపా చెరశాలను బద్దలు కొట్టి.. ప్రజా ప్రభుత్వం తీసుకురావాలని పిలుపు
` బీజేపీపై మమత ఫైర్
కోల్‌కతా(జనంసాక్షి):బొరుగులు, పాలపొడి వంటి వస్తువులపైనా భాజపా జీఎస్టీ అమలుచేస్తోందని.. మరి ప్రజలు ఏం తింటారు?..ఈ దేశంలో పేదలు ఎలా బతకాలని పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ అని కేంద్రాన్ని ప్రశ్నించారు.బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోయాలని కాషాయ పార్టీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. రాజకీయ ప్రత్యర్ధులపై కక్ష సాధింపు రాజకీయాలతో కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలను ప్రయోగించి దాడులు చేయిస్తోందని దీదీ మండిపడ్డారు.2024లో దేశ ప్రజలు ఇవ్వబోయే తీర్పుతో కేంద్రంలో భాజపా అధికారం కోల్పోతుందని వ్యాఖ్యానించారు. దేశ కరెన్సీ రూపాయి విలువ రోజురోజుకీ పతనం కావడం పట్ల దీదీ ఆందోళన వ్యక్తంచేశారు. అమరవీరుల దినోత్సవం సందర్భంగా కోల్‌కతాలో తృణమూల్ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన భారీ ర్యాలీకి లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా దీదీ మాట్లాడారు. మహారాష్ట్రలో చేసినట్టుగా బెంగాల్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రయత్నిస్తే తగిన రీతిలో సమాధానమిస్తామని భాజపా శ్రేణులకు దీదీ హెచ్చరించారు. అగ్నిపథ్ పథకం పేరిట కేంద్ర సాయుధ బలగాలను కూడా నిర్వీర్యం చేస్తోందని భాజపాపై మండిపడ్డారు. బెంగాల్‌కు పెండిరగ్‌లో ఉన్న నిధుల్ని మంజూరు చేయకపోతే దిల్లీలో భాజపా నాయకత్వాన్ని ఘెరావ్ చేస్తామని హెచ్చరించారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో ఎలాంటి పాత్ర లేని వాళ్లు ఇప్పుడు దేశ చరిత్రను తిరగరాయాలని ప్రయత్నిస్తున్నారంటూ దీదీ ధ్వజమెత్తారు. భాజపా చెరను బద్దలుకొట్టి.. 2024లో కేంద్రంలో ప్రజా ప్రభుత్వాన్ని తీసుకురావాలని పిలుపునిచ్చారు.
11.రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి..
` రూ.1800కోట్లతో ‘బయోలాజికల్ ఈ’ విస్తరణ ప్రణాళిక
` హైదరాబాద్ ఇప్పటికే ప్రపంచ వ్యాక్సిన్ల రాజధానిగా పేరుగాంచింది:మంత్రి కేటీఆర్
` బయోలాజికల్ ఈ విస్తరణతో దీనికి మరింత బలం చేకూరుతుందని వెల్లడి
హైదరాబాద్(జనంసాక్షి):రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. ప్రముఖ ఫార్మా దిగ్గజం బయోలాజికల్ ఈ జీనోమ్ వ్యాలీలో పెట్టుబడి పెట్టనున్నది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌తో గురువారం జరిగిన భేటీలో సంస్థ ప్రతినిధులు విస్తరణ ప్రణాళికలను ప్రకటించారు. జీనోమ్ వ్యాలీలోని తమ ప్లాంట్‌లో రూ.1800కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌కు వివరించారు.దీంతో 2500 మందికి ఉపాధి లభిస్తుందని కంపెనీ తెలిపారు. జాన్సన్ అండ్ జాన్సన్ కొవిడ్ వ్యాక్సిన్, ఎంఆర్ వ్యాక్సిన్, పీసీవీ వ్యాక్సిన్, టైఫాయిడ్ వ్యాక్సిన్, కొవిడ్ వ్యాక్సిన్, టెటానస్ టాక్సైడ్ ఆంపౌల్స్, బయోలాజికల్ ఏపీఐలు, ఫార్ములేషన్స్ తయారీపై దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు. జీనోమ్ వ్యాలీలో బయోలాజికల్ ఈ విస్తరణను ప్రకటించడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఇప్పటికే ప్రపంచ వ్యాక్సిన్ల రాజధానిగా పేరుగాంచిందన్న కేటీఆర్.. బయోలాజికల్ ఈ విస్తరణతో దీనికి మరింత బలం చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో బయోలాజికల్ ఈ ఎండీ మహిమా దాట్ల, రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు.
12.ధరల పెంపు, జీఎస్టీపై కేంద్రం మొండి వైఖరి..
లోక్‌సభ నుంచి టీఆర్‌ఎస్ వాకౌట్
న్యూఢల్లీి(జనంసాక్షి): ధరల పెంపు, జీఎస్టీ అంశాలపై కేంద్రం మొండి వైఖరిని అవలంబిస్తోంది. ఈ అంశాలను చర్చించాలని కోరినా.. పార్లమెంట్‌లో ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇవాళ సభ ప్రారంభమైన తర్వాత ప్రశ్నోత్తరాలు జరిగాయి. అయితే ఆ సమయంలో విపక్ష సభ్యలు నినాదాలతో హోరెత్తించారు.ధరల పెంపు, జీఎస్టీ అంశాలపై చర్చించాలని డిమాండ్ చేశారు. కానీ కేంద్ర సర్కార్ మొండి విధానాన్ని పాటించింది. ప్రజాసమస్యలపై చర్చించాలని టీఆర్‌ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు పట్టుపట్టారు. కేంద్రం ఏమాత్రం స్పందించకపోవడంతో.. టీఆర్‌ఎస్ ఎంపీలు లోక్‌సభ నుంచి వాకౌట్ చేశారు. టీఆర్‌ఎస్‌తో పాటు డీఎంకే, ఎస్పీ, బీఎస్పీ, టీఎంసీ కూడా సభ నుంచి వాకౌట్ చేశాయి. స్పీకర్ చర్చకు అనుమతి ఇవ్వకపోవడంతో వాకౌట్ చేసినట్లు విపక్షాలు తెలిపాయి.
all news